ప్రశాంత్ నగర్‌లో పౌర సమస్యలపై కమిషనర్ సమీక్ష

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపడుతున్న వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్ నగర్ వార్డులో పౌర సమస్యలు, అభివృద్ధి అవసరాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. సీఎంసీ కమిషనర్ సృజ‌న‌, జోనల్ కమిషనర్, మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు వార్డు ప్రజలతో సమావేశమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్ల రీకార్పెటింగ్, నీటి నిల్వలు, బాలానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ రద్దీ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఎస్టీపీ నిర్వహణ, రోడ్ల ఆక్రమణలు వంటి సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ఓవర్‌హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే బాలానగర్ మెట్రో స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ), కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, విద్యుత్ లైన్ల సమీపంలోని చెట్ల కొమ్మల తొలగింపు, క్రమం తప్పకుండా సాట్ ఆటో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఏవీ పురం కాలనీలో నీటి నిల్వలు, ట్రాన్స్‌ఫార్మర్, నీటి పైప్‌లైన్, డ్రైనేజీ సమస్యలను కూడా అధికారులు పరిశీలించారు. ప్రజలు వెల్లడించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుని గుర్తించిన సమస్యలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై వార్డు స్థాయి సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు సీఎంసీ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here