బహుజన రాజ్య తొలి స్వాప్నికుడు.. సామాజిక న్యాయానికి స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి PAC ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఘన నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌తోపాటు గౌడ ప్ర‌జ‌లు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. సుమారు 376 ఏళ్ల క్రితం, 1650 ఆగస్టు 18న తెలంగాణ గడ్డపై జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల నుంచి ఎదిగి స్వీయ పాలన కోసం పోరాడిన మహోన్నత ప్రజా యోధుడని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం, రాజ్యాధికార చైతన్యం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మనిషికి గౌరవం ఉండాలి, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి, అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించాలి, అధికారంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలనే స్ఫూర్తిని పాపన్న తన పోరాటం ద్వారా చాటిచెప్పారని గాంధీ అన్నారు. అందుకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం చారిత్రక వీరుడు మాత్రమే కాదని.. బహుజన సమాజానికి ఆత్మగౌరవానికి ప్రతీక, సామాజిక న్యాయానికి స్ఫూర్తి, సమానత్వానికి చిహ్నమని చెప్పారు. సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పాపన్న పోరాడారని తెలిపారు. సామాన్యుడి నుంచి నాయకుడిగా, యోధుడిగా, పాలకుడిగా ఎదిగి అప్పటి అధికార వ్యవస్థకు సవాల్ విసిరిన ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు.

గోల్కొండతోపాటు అనేక కోటలపై తన ప్రభావాన్ని నెలకొల్పిన పాపన్న.. సైనిక ప్రతిభతోపాటు అప్పటి రాజకీయ వ్యవస్థలను సవాల్ చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని గాంధీ తెలిపారు. ఆయనతో అనుబంధం ఉన్న ఖిలాషాపూర్ కోటను చారిత్రక వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఆయన చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. పాపన్న పోరాటంలో గోల్కొండ ఘట్టం అత్యంత కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి ప్రజాబలంతో ఎదిగి గోల్కొండ వంటి ప్రధాన రాజకీయ, సైనిక కేంద్రాన్ని సవాల్ చేయడం ఆయన పోరాట ప్రత్యేకతను తెలియజేస్తుందని అన్నారు. పాపన్న ప్రభావం విస్తరించడంతో అప్పటి మొఘల్ అధికార వ్యవస్థకు ఆయన సవాల్‌గా మారారని చెప్పారు. ఎన్ని సైనిక చర్యలు, కోటలపై దాడులు జరిగినా తిరిగి తన శక్తిని సమీకరించుకుని పోరాటాన్ని కొనసాగించిన పాపన్న ధైర్యం, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని గాంధీ అన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను స్మరించుకోవడం కేవలం జయంతి వేడుకలకు పరిమితం కాకూడదని గాంధీ అన్నారు. ఆయన ఆశయాలను అర్థం చేసుకుని ఆత్మగౌరవం, ఐక్యతా స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి కులానికి సమన్యాయం, ప్రతి వర్గానికి సమాన గౌరవం, ప్రతి అర్హుడికి సమాన అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కేలా కృషి చేయడమే పాపన్నకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు, గౌడ ప్ర‌జ‌లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here