- ఈత రాకున్నా చెరువులోకి దిగిన విద్యార్థులు..
- నీటమునిగి మృతి
- ముగ్గురు ఒకే స్కూల్ వారే
- నానక్ రాంగూడలో నెలకొన్న విషాదఛాయలు
నమస్తే శేరిలింగంపల్లి: ఈత కోసం వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన పోలీస్ గచ్చిబౌలి స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలి డివిజన్ టెలికాం నగర్ కు చెందిన దిలీప్(13), పవన్ (12), షాబాజ్ (15) విజయ భారతి స్కూల్లో చదువుతున్నారు. అయితే వీరు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరుగురు చిన్నారులతో కలిసి పటేల్ కుంట చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉందని భావించి వీరితో వచ్చిన ఆరుగురు చిన్నారులు బయటే ఉండగా.. దిలీప్, పవన్, షాబాజ్ లు మాత్రం ఈత రాకున్నా చెరువులోకి దిగారు. నీట మునిగి కేకలు వేయడంతో మిగతా చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొని అటుగా వెళ్తున్న వాహనదారులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు తెలిపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా.. అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో వారి మృతదేహాలను వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించామని గచ్చిబౌలి సురేష్ తెలిపారు. కాగా చిన్నారుల మృతితో టెలికం నగర్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.