శేరిలింగంపల్లి: హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రాజెక్ట్ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా మియాపూర్ చౌరస్తా నుండి బీహెచ్ఈఎల్ చౌరస్తా వరకు పూణె నమూనా ప్రకారం మెట్రో మార్గం,ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఎస్ఆర్‌డీపీపై రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆరెకపూడి గాంధీ ప్రసంగిస్తూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించేందుకు గాను ఇప్పటికే ఎస్ఆర్‌డీపీలో భాగంగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అండర్ పాస్ మార్గాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్ఆనరు. శేరిలింగంపల్లి నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మిస్తుందని అన్ఆనరు. కరోనా విపత్కర స్థితిలోనూ ఎక్కడా అబివృద్ధి పనులు ఆగడం లేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ, సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మాదాపూర్ ఐటీ కారిడార్ వాసులకు ట్రాఫిక్ అవస్థలు తప్పేలా దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తుండడం అభినందనీయమన్నారు. అందుకు మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.