తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తోంది

టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహాం

అధికారులు కూల్చివేసిన షెడ్డు

శేరిలింగంపల్లి: ప్రభుత్వం చేసే తప్పొప్పుల్ని ఎత్తి చూపితే దౌర్జన్యంగా దాడులు చేసే నిరంకుశ పాలన తెలంగాణ లో నడుస్తుందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు ఎం. రవికుమార్ యాదవ్ లు ఆరోపించారు. నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ లో ఓ సామాన్యుడి నిర్మించుకున్న సర్వీసింగ్ షెడ్డు పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఘటనపై వారు మాట్లాడుతూ మియాపూర్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం అనే ఓ వ్యక్తి నూతనంగా ఓ కారు సర్వీసింగ్ షెడ్డును నిర్మించి దాదాపు 15 మందికి ఉపాధి కల్పించాడని తెలిపారు. మూడు రోజుల క్రితం తాము సదరు సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. తిరిగి వస్తుండగా జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో గల లోపాలను తాము సోషల్ మీడియా వేదికగా లెవనెత్తామన్నారు. జిహెచ్ఎంసి అధికారుల పని తీరుపై ప్రజలు భారీగా స్పందించారన్నారు. దీంతో అధికారులు కక్ష పూరితంగా తాము ప్రారంభించిన షెడ్డును ముందస్తు నోటీసులు లేకుండా గురువారం కూల్చి వేశారన్నారు. విషయం తెలియగానే తాను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులను నోటీసులపై ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అధికారులు కూల్చివేతలు చేపట్టారని, లోపాలను ఎత్తి చూపిన తమను ఎదుర్కొనలేక సామాన్యులపై ప్రతాపం చూపించారన్నారు. ఇరవై మంది పోలీసులతో బందోబస్తు ఉంచి న్యాయం అడగడానికి వచ్చిన తమపై బలవంతంగా అడ్డుకున్నారన్నారు. కూల్చివేతల కారణంగా షెడ్డులో ఉంచిన వినియోగదారుల కార్లు సైతం ధ్వంసం అయ్యాయని తెలిపోయారు. ఈ విషయంపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, బాధితులకు న్యాయం జరిగి అధికారులపై చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమిస్తామని ఆయన తెలిపారు.

కూల్చివేతల్లో ధ్వంసమైన కారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here