శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ కు విన్నవించారు. శుక్రవారం ప్రగతి భవన్ నిర్వహించిన సమావేశానికి చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డితో కలిసి హాజరైన ఆయన నియోజక వర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అన్ని డివిజన్లలో చెరువులు ,లింక్ రోడ్లు , సిసిరోడ్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి గాను నిధుల అవసరాల మంజూరి కై ప్రతిపాదనలను అందజేశామని తెలిపారు. దీంతోపాటు గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీ, సర్వే నెంబర్ 44 లకు సంబందించిన రెవెన్యూ విషయాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి తారకరామారావులు మంచి విజన్ తో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని, అభివృద్ధి ఫలాలు ప్రతీ పౌరుడికి అందేలా చూడటం తమ బాధ్యత అని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని బస్తీలలో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.