నమస్తే శేరిలింగంపల్లి : సీఐటీయూ ఆధ్వర్యంలో మియాపూర్ విద్యుత్ కార్యాలయం వద్ద, చందానగర్ హుడా కాలనీలో వివిధ రంగాల కార్మికుల సమక్షంలో మేడే ను ఘనంగా నిర్వహించారు. సీనియర్ కార్మిక నాయకులు మియాపూర్ లో జగదీష్, చందానగర్ లో ఆనంద్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి. శోభన్, జోన్ కమిటీ సభ్యులు వి. మాణిక్యం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
8 గంటల పని విధానం కోసం, కార్మికుల హక్కుల కోసం కార్మికులు రక్తం చిందించిన రోజు మేడే అని అన్నారు. కార్మికులు, ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. సంపద సృష్టించే కార్మికులకు కనీస వేతనాలు కూడా లేవని చెప్పారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కె. కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మికులు, అంగన్ వాడి కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఆయా రంగాల నుండి మహేందర్, శివ, కృష్ణ, నాగమణి, యశోధ, శివలీల, ముత్తమ్మ పాల్గొన్నారు.