- ర్యాలీలో పాల్గొని మాట్లాడిన మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్
నమస్తే శేరిలింగంపల్లి: మట్టి మనుషులను విప్లవ వీరులను తీర్చిదిద్దిన పోరాటమే వీర తెలంగాణ సాయుధ పోరాటమని ఎంసీపీ ఐ యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ అన్నారు. నాటి ప్రజల విరోచిత పోరాట చరిత్రను వక్రీకరించే పాలకవర్గ పార్టీలకు, ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు గాను ఆల్విన్ చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద ఎంసిపిఐయు మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షుతన జరిగిన ఈ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా రజాకారుల గుండెలను గోరి కట్టి నైజాం సైన్యాలను మట్టికరిపించి గ్రామాలను విముక్తి చేసి, గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసిన ఘనత వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులదని తెలిపారు. స్వాతంత్ర పోరాటం జరుగుతుండగా తెలంగాణ లో నైజాం నవాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా, దొరల పెత్తందారుల దౌర్జన్యాలకు, దోపిడీ హత్యాచారాల పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే వీర తెలంగాణ సాయుధ పోరాటమని అన్నారు. కష్టజీవుల, కార్మికుల, రైతు కూలీల రక్తంతో తడిపి ఎరుపెక్కిన చరిత్ర అని చెప్పారు. సెప్టెంబర్ 17ను కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్ ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను అడ్డుపెట్టుకుని అవకాశ వాదాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
బిజెపి మత సంస్థలు పటేల్ సైన్యాల విజయమని విమోచన ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, అధికారంలో ఉన్న బిఆర్ ఎస్ ప్రభుత్వం ఆనాటి ప్రజల చరిత్రను పాఠ్యాంశాలలో కాని, వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో కాని విఫలమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలక వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అవలంబిస్తున్న మతపరమైన, అవకాశవాద పరమైన విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. గ్రేటర్ సహాయ కార్యదర్శి టీ అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుకన్య, వి. తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ పల్లె మురళి, అంగడి పుష్ప, ఏఐఎఫ్డి డబ్ల్యు మహిళా సంఘ నాయకులు బి. విమల, జి. శివాని, జి. లలిత, అరుణ, పార్టీ డివిజన్ నాయకులు నర్సింగ్ ఇషాక్, శంకర్, శ్రీనివాస్ ఎంవైకుమార్ పాల్గొన్నారు.