నమస్తే శేరిలింగంపల్లి: మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పి కారు పల్టీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరు ప్రాంతానికి చెందిన విశ్వతేజ(26) నానాక్‌రాంగూడలో నివాసముంటూ సొంతగా వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. కాగా శుక్రవారం నోవాటెల్‌లోని పబ్‌లో మిత్రులతో కలిసి మద్యం సేవించిన విశ్వతేజ తన కారులో ఎపి 12 ఎం 9090 తన స్నేహితుడు ఇంద్రజిత్ వర్మతో కలిసి వస్తూ మెటల్ చార్మినార్ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో విశ్వతేజ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలతో చికిత్స పొందిన ఇంద్రజిత్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత వాహనాన్ని నడిపేలా ప్రోత్సహించిన ఇంద్రజిత్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ప్రమాదంలో పల్టీ కొట్టిన కారు