చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా శుక్రవారం చందానగర్ చౌరస్తాలో వామపక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శోభన్, శ్రీశైలం గౌడ్, రమేష్ లు మాట్లాడుతూ రైతులు ఢిల్లీలో నాలుగు నెలలుగా పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తుందని, కార్మిక రైతు వ్యతిరేక ప్రభుత్వం గా బిజెపి ప్రభుత్వం మారిందన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం పని చేయడం శోచనీయమన్నారు. దేశంలో నిరుద్యోగం రేటు పెరిగి పోవడం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలకు కనీస జీవన ప్రమాణాలు రోజురోజుకు పడిపోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, మురళి, కన్నా శ్రీనివాస్, చందు యాదవ్ ,పుష్ప, నారాయణ తదితరులు పాల్గొన్నారు.






