మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ చంద్రనాయక్ తండాలో గత ఆదివారం అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతమైంది. తెలిసిన చోట వెతికినా, ఇంటి ప్రక్క సెల్లార్ గుంతలో అనుమానంతో నీళ్లు ఖాళీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి పోలీసులు కేసులో అనుమానితుడైన కిషన్ పై దృష్టి సారించారు. ఊహించినట్లుగానే అనుమానితుడే నిందితుడయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం…
చంద్రనాయక్ తండాలో నివాసముండే రాములు నాయక్ కుమారుడు మోక్ష(4) గత ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే తల్లిదండ్రులు తెలిసిన ప్రాంతాలన్నీ వెతికినా ఫలితం లేకపోవడంతో మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఇంటి ప్రక్కన సెల్లార్ గుంతలో ప్రమాదవశాత్తు పడి ఉంటాడనే అనుమానంతో జిహెచ్ఎంసి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సోమవారం పగలంతా శ్రమ పడి నీళ్లు తొడిసినా ఫలితం లేకపోయింది. దీంతో కొందరు స్థానికులు కాలనిలో గతంలో నివాసమున్న కిషన్ అనే వ్యక్తిని చూశామని, అతనిపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు జరిపారు. సిసిటీవి ఫుటేజీ ఆధారంగా బాలుడిని కిషన్ అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. కిషన్ సంబంధికులను పోలీసులు విచారించిన విషయాన్ని తెలుసుకున్న కిషన్ బాలుడిని మేడిపల్లి ఔటర్ రింగురోడ్డు సమీపంలో వదలి వెళ్లాడు. ఉదయం గస్తీ కాస్తున్న పోలీసులు బాలుడిని చేరదీసి తల్లిదండ్రులకు అప్పగించారు. కిషన్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి అదృశ్యమైన వార్తకోసం క్రింద లింకును క్లిక్ చేయండి
నాలుగేళ్ళ బాలుడు అదృశ్యం…సెల్లార్ గుంత ఖాళీ చేసినా…