- అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంఏ నగర్ కాలనీ వాసులకు ఎమ్మెల్యే గాంధీ భరోసా
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలో ఎన్నో ఏండ్లుగా నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఇటీవల హెచ్ఎండీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆ కాలనీలో పర్యటించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎంఏ నగర్ కాలనీవాసులు ఆందోళనకు చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. గతంలో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, తాము అధికారులతో కలిసి వెళ్లి భూమి ఆక్రమణ జరుగకుండా ఉండేందుకు చుట్టూ ఫెన్సింగ్ (కంచె) వేస్తామని ప్రతిపాదించినట్లు తెలిపారు. హెచ్ఎండీఏ లో పనిచేసే కొంతమంది అధికారులు వ్యాపారం చేస్తున్నారని కమిషనర్ కి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. కంచె వేయకుండా అప్పట్లో అడ్డుకున్నారని, ఎంతమంది అధికారులున్న అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం 15 రోజులుగా ఆ భూమిని కబ్జా చేయాలని ఇతర జిల్లాల నుండి, ఇతర ప్రాంతాలనుండి భారీ ఎత్తున్న వచ్చి సమావేశాలు నిర్వహించి, దావత్ లు చేసుకుంటూ భూమి కబ్జా చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని, అశ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

గత 35 సంవత్సరాలుగా ఇప్పటి వరకు నివసిస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచినీటి వసతి, డ్రైనేజి, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పిస్తూ వస్తున్నామని, వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. గతంలో కోర్టు క్రమబద్దీకరణ చేయమని ఆదేశాలు ఇచ్చిందని, యథాస్థితి (స్టేటస్ కో) మెయింటైన్ చేయమని ఆదేశాలచ్చిందని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు నివాసం ఉంటున్న పేదలకు న్యాయం చేయాలన్నారు. కొత్తగా కబ్జాకు గురయ్యే భూమిని కాపాడాలని, ప్లాట్లు చేసి వ్యాపారం చేసే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా తమపై ఉందని, అవసరమైతే ప్రభుత్వం, హెచ్ఎండీఏ కమిషనర్ , కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్, కృష్ణ రావు, జంగం మల్లేష్, రాజు గౌడ్, శివ , వెంకటేష్, నరేష్, రాజు, దశరథ్, రహ్మాతుల్లా, భీమ్ రాజు, నర్సింలు గౌడ్, నాగరాజు, పాండు, మహిళలు కాలనీ వాసులు పాల్గొన్నారు.