సైబరాబాద్‌లో వాక్ ఫ్రీ డ్రైవ్.. 16.7 కి.మీ. పరిధిలో 420 ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

శేరిలింగంపల్లి, జూలై 18 (న‌మస్తే శేరిలింగంపల్లి): పాదచారులకు సురక్షితమైన, అడ్డంకులు లేని ఫుట్‌పాత్‌లను అందించాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో వారాంతపు వాక్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా శనివారం మూడు జోన్‌ల పరిధిలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 15 సర్కిళ్లలోని 16 ప్రాంతాల్లో 16.7 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి 420 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ జోన్‌లో 7 సర్కిళ్ల పరిధిలోని 8 ప్రాంతాల్లో 8.2 కిలోమీటర్ల మేర డ్రైవ్ చేపట్టి 197 ఆక్రమణలను తొలగించారు. చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, డుండిగల్, మేడ్చ‌ల్ సర్కిళ్లలో ఈ చర్యలు చేపట్టారు.

కూకట్‌పల్లి జోన్‌లో 3 సర్కిళ్ల పరిధిలోని 3 ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి 67 ఆక్రమణలను తొలగించారు. మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి సర్కిళ్లలో డ్రైవ్ నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్‌లో 5 సర్కిళ్ల పరిధిలోని 5 ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 156 ఆక్రమణలను తొలగించారు. నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. వారాంతపు వాక్ ఫ్రీ కార్యక్రమం ద్వారా ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి, పాదచారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యమని సీఎంసీ పేర్కొంది. ఫుట్‌పాత్‌లు, ప్రజా స్థలాలను ఆక్రమించకుండా దుకాణదారులు, వీధి వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, ప్రజలు సహకరించాలని, ప్రజా మౌలిక వసతుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here