శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముద్దంగుల తిరుపతి పరిశీలించారు. ప్రశాంత్‌నగర్ కమిటీ హాల్, ఎం.ఏ. నగర్ కమిటీ హాల్, జనప్రియ వెస్ట్ సిటీ కమిటీ హాల్, బీకే ఎన్‌క్లేవ్ కమిటీ హాల్, మయూరి నగర్ వార్డ్ కార్యాలయం, మియాపూర్ న్యూ కాలనీ వినాయక మండపంతోపాటు పలు కాలనీల్లో కొనసాగుతున్న ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ముద్దంగుల తిరుపతి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా SIR కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) అందజేసే ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని సూచించారు. అలాగే, SIR కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్‌వోలకు సూచించిన ఆయన, ఒక వ్యక్తికి రెండు చోట్ల నమోదైన ఓట్లను గుర్తించి ఒకే ఓటు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించి ఓటర్ల జాబితాను పరిశుభ్రంగా రూపొందించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎన్‌టీయూసీ నాయకులు నల్ల సంజీవరెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరమల్ల వీరేందర్ గౌడ్, ఉయ్యూరు శ్రీదేవి, మాజీ వార్డ్ కమిటీ సభ్యురాలు వీరమల్ల సంగీత, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి మన్నె నరేందర్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, అలాగే స్థానిక కాలనీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.





