శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీతోపాటు మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి, సంతకం చేసి తప్పనిసరిగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు అందజేయాలని సూచించారు. ఆగస్టు 10 చివరి తేదీ కావడంతో ప్రతి ఒక్కరూ గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.

SIR కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నాయకులకు సూచించిన గాంధీ, చివరి రోజులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు వారధిగా నిలిచి అర్హులైన ప్రతి ఒక్కరి నమోదు పూర్తయ్యేలా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న గాంధీ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఫారం నింపడం మాత్రమే కాకుండా, దానిని BLOకు తిరిగి అందజేసినప్పుడే నమోదు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ఎన్యుమరేషన్ ఫారాలు ఆలస్యంగా అందడం, హైరైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో BLOలకు ప్రవేశం లభించకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించిన ఆయన, మిగిలిన రోజుల్లో ప్రజాప్రతినిధులు, కాలనీ అసోసియేషన్లు, యువత, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్లు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం అవసరమైతే ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తారని, అటువంటి సందర్భంలో ప్రభుత్వం గుర్తించిన గుర్తింపు పత్రాలు సమర్పించాలని తెలిపారు. పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, పెన్షన్ ఉత్తర్వులు, విద్యా ధ్రువపత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ నమోదు పత్రం, భూమి లేదా గృహ కేటాయింపు పత్రాలు వంటి పత్రాలు అర్హత నిరూపణకు ఉపయోగపడతాయని వివరించారు.
ఫారం సమర్పించే ముందు తాజా ఫోటో, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, కుటుంబ వివరాలు, సంతకం వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఫారం సమర్పించిన అనంతరం BLO నుంచి అక్‌నాలెడ్జ్‌మెంట్ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, సమర్పించిన ఫారం, జత చేసిన పత్రాల ప్రతులను భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి కూడా ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





