శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని గంగారం గ్రామంలో జాతీయ రహదారి (NH-65) విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ గ్రామ పెద్దలు, మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి, రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల గంగారం రోడ్డులో ఉన్న శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ముంబై జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని, గ్రామ ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆరెకపూడి గాంధీ భరోసా ఇచ్చారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా, అందరికీ ఆమోదయోగ్యమైన నష్టపరిహారం అందేలా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ట్రాఫిక్ రహిత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు జాతీయ రహదారి విస్తరణతోపాటు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గంగారం గ్రామ పెద్దలు, బాధిత కుటుంబాల సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





