శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, చందానగర్, గంగారం గ్రామం, జవహర్‌లాల్ రోడ్ నంబర్లు 1 నుంచి 4 వరకు ఉన్న కమ్యూనిటీ హాల్‌లో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) నిర్వహించారు. అర్హులైన ఓటర్లకు ఎస్‌ఐఆర్ ఫారాలను అందజేసి, ఓటరు వివరాలను సరిచేసుకోవడం, ఫారాలను సక్రమంగా పూరించడం, నిర్దేశిత గడువులోగా సమర్పించడం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కట్ల శేఖర్ రెడ్డి కార్యక్రమం పురోగతిని సమీక్షించి, బీఎల్‌వోలతో మాట్లాడారు. ప్రతి అర్హుడైన ఓటరుకి అవసరమైన సహాయం అందేలా కృషి చేయాలని వారికి సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, తమ ఓటరు వివరాలను నవీకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.





