శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అన్ని జోన్లలో ప్రత్యేక ఆయిల్ బాల్ విడుదల కార్యక్రమాన్ని చేపట్టనుంది. నిల్వ కలుషిత నీటి వనరుల్లో దోమల లార్వాను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మురుగు కాలువలు, నిల్వ నీరు ఉన్న లోతట్టు ప్రాంతాలు, మురుగునీటి గుంటలు, నీటితో నిండిన ఖాళీ స్థలాలు, దోమల సంతానోత్పత్తికి అనుకూలమైన ఇతర ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వినియోగించి లార్వా నియంత్రణ చర్యలు చేపడతారు.

మొదటి రోజు వార్డుల వారీగా దోమల సంతానోత్పత్తి కేంద్రాలను గుర్తించి నిల్వ నీటి వనరులు, మురుగు కాలువలు, గుంటలు, ఖాళీ స్థలాల మ్యాపింగ్ చేపడతారు. తీవ్రత ఆధారంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయిస్తారు. రెండో రోజు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ హెల్త్ (AMOHలు) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ధ్రువీకరణ నిర్వహించి ఆయిల్ బాల్స్ వినియోగానికి అనువైన ప్రాంతాలను ఖరారు చేస్తారు. ఫీల్డ్ బృందాలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేస్తారు. మూడో నుంచి ఐదో రోజు వరకు గుర్తించిన ప్రాంతాల్లో సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం ఆయిల్ బాల్స్ విడుదల చేస్తారు. విడుదలకు ముందు, తర్వాత ఫోటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ నిర్వహించడంతోపాటు రోజువారీ సమీక్ష చేపడతారు. ఆరవ రోజు కార్యక్రమంపై సమగ్ర సమీక్ష నిర్వహించి, గుర్తించిన సంతానోత్పత్తి కేంద్రాలు, ఆయిల్ బాల్స్ వినియోగ వివరాలు, ఎదురైన సవాళ్లు, ఉత్తమ పద్ధతులతోపాటు జియో-ట్యాగ్ చేసిన ఫోటోలతో నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపిస్తారు.

ఈ కార్యక్రమాన్ని AMOHలు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU), పారిశుద్ధ్య సిబ్బంది, ఫీల్డ్ బృందాలు సమన్వయంతో అమలు చేయనున్నాయి. కార్యక్రమ పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయనున్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో నిల్వ నీరు లేదా దోమల సంతానోత్పత్తి కేంద్రాలు కనిపిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి ఈ కార్యక్రమానికి సహకరించాలని CMC విజ్ఞప్తి చేసింది.





