శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడం, ఏకాగ్రతతోపాటు జ్ఞాపకశక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని, ఆ దిశగా కుసుమ ప్రభాకర్ చేస్తున్న కృషి అభినందనీయమని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్‌లో ప్రముఖ అబాకస్ శిక్షణా సంస్థ మాస్టర్ మైండ్ నూతన బ్రాంచ్‌ను ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా చందానగర్‌లో అబాకస్ శిక్షణను విజయవంతంగా నిర్వహిస్తూ, మరింత మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందించాలనే లక్ష్యంతో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించడం అభినందనీయమని సంస్థ నిర్వాహకురాలు కుసుమ ప్రభాకర్‌ను ప్రశంసించారు.

కార్యక్రమంలో ఇప్పటికే శిక్షణ పొందుతున్న చిన్నారులు క్లిష్టమైన గణిత లెక్కలను కేవలం కొన్ని సెకన్లలో పరిష్కరించడం చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారు అలాంటి నైపుణ్యాన్ని ఎలా సాధించారో కుసుమ ప్రభాకర్‌ను అడిగి తెలుసుకుని, చిన్నారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. తొలుత ఎమ్మెల్యే గాంధీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించగా, సంస్థ డైరెక్టర్ క్యాబిన్‌ను చందానగర్ కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు.





