శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీకి చెందిన తోట వెంకటేశ్వరమ్మకు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.1,50,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన LOC మంజూరు పత్రాన్ని ప్రభుత్వ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ బాధిత కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ తోడ్పడుతోందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, వైద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఈ నిధి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, పితాని శ్రీనివాస్, చంద్రమోహన్ సాగర్, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు.





