మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

  • ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలి: సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్ కుమార్
  • ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ఎమ్ రెయిన్‌బో లైవ్ ఇన్ లో పాల్గొన్న సీపీ సజ్జనార్, డిసిపి విజయ్ కుమార్
  • లైవ్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన

సైబ‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్ కుమార్ లు బుధ‌వారం ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ఎమ్ రెయిన్‌బో లైవ్ ఇన్ లో ‘’Stay Alive- Think & Drive’’, Wait for the Red.. Do not end up dead అనే ట్యాగ్ లైన్ తో నిర్వహించిన లైవ్ ప్రోగ్రామ్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన ల‌భించింది. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్నచర్యలను ప్రజలకు వారు వివరించారు. ప్రజల నుంచి సలహాలు, సూచన‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానాలు చెప్పారు.

ఫోన్ ఇన్ లైవ్ లో భాగంగా ప్ర‌జ‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తున్న సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్‌, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజ‌య్ కుమార్

1) ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లు ఎక్కువగా జరగడానికి కారణలేమిటి ? ఎక్కువగా ఏ టైమ్ లో జరుగుతున్నాయి ?
సీపీ స‌జ్జ‌నార్‌: రోడ్డు ప్రమాదాలు సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 వరకు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రంకెన్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున కూడా నిద్రలేమి, అర్జెంట్ గా వెళ్లాలనే కారణంగా డివైడర్లకు, చెట్లకు వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.

2) గత వారం గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ జిల్లా విప్రో జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు రెడ్ లైట్ పడినప్పటికీ వేగంగా ముందుకు వెళ్లడంతో అటుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకులు చనిపోయారు. దీన్ని ఎలా చూస్తారు మీరు ?
సీపీ: ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత సురక్షితంగా తిరిగి రావాల్సిన బాధ్యత మీదే. మీ తల్లిదండ్రులకు మీరే ప్రపంచమని యువత గుర్తించాలి. ఫైనాన్షియల్ జిల్లా విప్రో జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లైతే రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ముందుకు వెళ్లడం తప్పిదం. పగలైనా, రాత్రైనా రెక్లెస్ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం తప్పు. వాహనం నడుపుతున్న ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు క‌చ్చితంగా పాటించాలి. ఓపికను పెంచుకోవాలి. ఇటీవల రోడ్లు బాగుండడంతో యువత జాయ్ రైడ్స్ కు వస్తున్నారు. ఇది సరి కాదు.

డిసిపి ట్రాఫిక్: ఐదుగురు యువకులు ఒకసారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇది సమాజానికి వారి కుటుంబానికి తీరని విషాదం. మరోవైపు రోడ్డు మీద ప్రయాణించే ఇతర ప్రయాణికులను కూడా ఇది భయాందోళనల‌కు గురి చేస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి మధ్య రాత్రి 12 గంటల వరకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడే కచ్చితమైన కారణాలను తెలుసుకోగలుగుతాము. 2019, 2020 సంవత్సరాలకు గాను సైబరాబాద్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే ఓవర్ స్పీడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, వాహనాన్ని నడపదానికి సరైన నైపుణ్యత లేని వారు నడపడం వల్ల అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

3) చిన్న పిల్లలు వాహనాలు నడిపితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? వారి తల్లిదండ్రులను బాధ్యులను చేస్తున్నారా ?
సీపీ: చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇస్తే నడిపిన వారిపై, ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నాము.

ఎలాంటి వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి ? ద్విచక్ర వాహనాలా ? ఫోర్ వీలర్సా ?
డిసిపి ట్రాఫిక్ : ప్రతీ సంవత్సరం దాదాపు 55 శాతం ద్విచక్ర వాహనాల ప్రమాదాలు మారణాంత‌క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

4) వాట్సాప్ గ్రూప్ ల ద్వారా పోలీసుల తనిఖీలు తప్పించుకుంటున్నవారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి ?
డిసిపి ట్రాఫిక్ : ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవింగ్ చెకింగ్స్ చేసేది మీకోసమేనని గుర్తించాలి. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు గానీ ప్రమాదాల నుంచి కాదని గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ల పై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ల పై సమాచారమిస్తే కేసులు నమోదు చేస్తాం.

5) టీనేజర్లు ఎక్కువ సీసీ క‌లిగిన‌ వాహనాలను నడుపుతున్నారు ? ఇది ఎంత వరకు శ్రేయస్కరం ?
సీపీ: ప్రజలల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు అప్పు చేసి మరీ పిల్లలకు ఎక్కువ సీసీ వాహనాలు కొనిస్తున్నారు. అయితే టీనేజ్ యువత ఆయా వాహనాలను కంట్రోల్ చేయలేక కొన్నిసార్లు మృత్యువాతపడుతున్నారు. ఇది సరి కాదు.

6) డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
సీపీ : రోడ్డు భద్రతపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. జైలుకి కూడా వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. కంపెనీస్ కి లెటర్లు రాస్తున్నాం. తాగి వాహనాన్ని నడపడం రోడ్ టెర్రరిజం లాంటిది. తాగి బండి నడిపితే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా వాహనాన్ని నడపడం శిక్షార్హం. పదేళ్ళ వరకు శిక్ష పడుతుంది.

డిసిపి ట్రాఫిక్ : డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వారి వివరాలు ఆర్టీఓకి పంపిస్తున్నాం. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. మళ్లీ మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడే వారి డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా తాగి వాహనాలు నడపవద్దు.

7) ఓవర్ స్పీడింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
డిసిపి ట్రాఫిక్ : రోడ్ ఇంజనీరింగ్ శాఖ నిర్ణయించిన మేరకు ప్రతీ రోడ్డుకు ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. అది సూచిక బోర్డులపై రాసి ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, నాగ్ పూర్ ఎన్ హెచ్-44, చేవెళ్ల, బీజాపూర్ అన్ని రోడ్ల మీద ఓవర్ స్పీడింగ్ వ‌ల్ల‌ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడింగ్ ఎక్కువగా ఉండే చోట్లలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు స్పీడ్ లేజర్ గన్, సిసిటివి సాయంతో స్పీడ్ గా వెళ్లే వాహనాలను గుర్తించి ఓవర్ స్పీడింగ్ కేస్ ఈ-చలాన్ నమోదు చేసి అలాంటి వారికి నోటీస్ లు పంపిస్తున్నాం. తద్వారా ఓఆర్ఆర్ పై చాలా వరకు ప్రమాదాలు తగ్గాయి.

8) బైక్ నడపాలనుకునే వారి వయస్సు ఎంత ఉండాలి ?
డిసిపి ట్రాఫిక్ : ముందుగా వాహనం నడపాలనుకునే వారికి లైసెన్స్ ఉండాలి. ద్విచక్ర వాహనాలు రెండు రకాలు. బైక్ 50 సిసి కంటే తక్కువ కెపాసిటీ ఉండే వాహనాలు వెహికిల్ విత్ అవుట్ గేర్ వాహనాలు నడపాలంటే 16 ఏళ్లు నిండి ఉండాలి. ఆర్టీఓలో అప్లికేషన్ తీసుకుంటే లర్నర్స్ లైసెన్స్ ఇస్తారు. బండి నేర్చుకొని ఆర్టీఓ లో పరీక్ష పాస్ అయిన వారికి లైసెన్స్ ఇస్తారు. 50 సిసి కంటే ఎక్కువ ఉండే వాహనాలు అంటే వెహికిల్ విత్ గేర్ నడపాలంటే 18 ఏళ్లు వయసు నిండి ఉండాలి. ఆర్టీఓ లో అప్లికేషన్ తీసుకుంటే లర్నర్స్ లైసెన్స్ ఇస్తారు. బండి నేర్చుకొని ఆర్టీఓ లో పరీక్ష పాస్ అయిన వారికి లైసెన్స్ ఇస్తారు. లర్నర్స్ లైసెన్స్ తీసుకున్న వారు ‘L’ బోర్డును ఏర్పాటు చేసుకోవాలి. వాహనం న‌డ‌ప‌డం వచ్చిన వారు వారితో పాటు ఉండాలి. ఈ రెండు నిబంధనలు అతిక్రమిస్తే వాహనాన్ని జప్తు చేస్తాం.

9) రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాయం చేసే వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ?
సీపీ : రోడ్డు ప్రమాదలకు గురైన వారికి సాయం చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దగ్గర్లో ఉన్న ఆసుపత్రులలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇవ్వండి. రోడ్ సేఫ్టీ కో-ఆర్డినేటర్స్ ను ఏర్పాటు చేశాం. వీరు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి సాయం చేస్తారు.

డిసిపి ట్రాఫిక్ : ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే తగు సాయం అందిస్తే వారు బ‌తికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్, కోర్టుల‌ చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో క్షతగాత్రులను కాపాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సుప్రీం కోర్టు జడ్జ్ మెంట్ ప్రకారం యాక్సిడెంట్ ల విషయంలో సాయం చేసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే సాక్షిగా పరిగణిస్తారు. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రోడ్డు ప్రమాదాల బాధితులకు దయచేసి సాయం చేయండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here