నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో మరిన్ని ప్రజా పోరాటాలు చేస్తామని సీపీఎం శేరిలింగంపల్లి నాయకులు మాణిక్యం, కృష్ణ ముదిరాజ్ లు అన్నారు. ఆదివారం రాష్ట్ర మహాసభల ఏర్పాటును పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు మేరకు ప్రజల వద్ద ఆర్థిక విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. శేరిలింగంపల్లి లోని వర్తక, వ్యాపార, వాణిజ్య దుకాణాలు, మార్కెట్ లో ప్రజలందరి సహకారం కోరుతూ నిధులు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కృష్ణ, మాణిక్యం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేసే ఏకైక పార్టీ సీపీఎం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించు అనే రీతిలో ప్రజా వ్యతిరేక అంశాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించి ప్రజావ్యతిరేక విధానాలను తీసుకొస్తుందన్నారు. కొంతమంది బడా సంస్థలకు దేశ సంపదను కట్టబెట్టేలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వరంగ సంస్థలు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాల పై తెలంగాణ రాష్ట్ర మహాసభ లో చర్చించి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ తమకు తోచిన మేర సిపిఎం పార్టీకి ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మొసిన్, సాహన, కృప తదితరులు ఉన్నారు.