శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మార్గదర్శకత్వంలో చింతల్ వార్డులో నిర్వహించిన వన్ డే–వన్ వార్డ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ) ప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా సమావేశంలో పారిశుద్ధ్యం, రహదారులు, వర్షపు నీటి కాలువలు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల కత్తిరింపు, ఆక్రమణలు, మున్సిపల్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణను నిర్ధారించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడాన్ని అరికట్టడం, పచ్చ వ్యర్థాల తొలగింపు, పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను పూర్తి చేయడం, కాలువల డీసిల్టింగ్, దెబ్బతిన్న డ్రెయిన్ గ్రిల్లుల మార్పు, వర్షపు నీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల మరమ్మత్తులు, కొత్త వీధి దీపాల ఏర్పాటు, చెట్ల కొమ్మల కత్తిరింపు, ఆక్రమణల తొలగింపు, భగత్‌సింగ్ నగర్ మల్టీపర్పస్ హాల్‌కు అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. సమస్యలకు సంబంధించిన పిన్‌పాయింట్ లొకేషన్ జాబితాను కాలనీ అధ్యక్షులకు అందజేసి, వాటిపై ధ్రువీకరణ, పర్యవేక్షణ, ఫాలోఅప్, సమన్వయం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
అలాగే, జలమండలి పరిధిలోని డ్రైనేజ్ సమస్యలను సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యం, అన్ని శాఖల సమన్వయంతో వన్ డే–వన్ వార్డ్ కార్యక్రమం ద్వారా నగర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, ప్రజా సేవలను మరింత మెరుగుపర్చేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.





