వైఎస్ఆర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింంగంప‌ల్లి, జూలై 8 (న‌మ‌స్తే శేరిలింంగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. మియాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, అయ్యప్ప సొసైటీలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నివాళుల కార్యక్రమాల్లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ప్రజా సంక్షేమం, మానవతా విలువలు, నిస్వార్థ ప్రజాసేవకు చిరస్మరణీయ నిదర్శనమని పేర్కొన్నారు. దృఢ సంకల్పం, అంకితభావం, కష్టపడే తత్వం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉంటే జీవితంలో ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వైఎస్ఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి వంటి రంగాలకు వైఎస్ఆర్ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. విద్య ద్వారా వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబం, సమాజం, రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుందనే విశ్వాసంతో ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు.

అధికారాన్ని వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాకుండా ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి బాధ్యతగా భావించిన అరుదైన నాయకుడు వైఎస్ఆర్ అని జగదీశ్వర్ గౌడ్ కొనియాడారు. రైతులు, పేదలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సహా సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమమే ఆయన పాలనా తత్వానికి కేంద్రబిందువుగా నిలిచిందని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావడం వైఎస్ఆర్ నాయకత్వంలోని విశిష్ట లక్షణమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాల్లో ఆశలు నింపి, ప్రభుత్వం ప్రజల గడపకు చేరాలనే ఆలోచనను కార్యరూపంలో చూపించిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు వైఎస్ఆర్ జీవితంలోని క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, సేవా తత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాల సాధనతోపాటు సమాజాభివృద్ధికి తోడ్పడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, కృష్ణ, మన్నేపల్లి సాంబశివరావు, కట్ల శేఖర్ రెడ్డి, మహిపాల్ యాదవ్, మోహన్ సింగ్, గోపాల్ నాయక్, మిరియాల ప్రీతం, ప్రసన్న సురేష్ నాయక్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీహరి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, రాంచందర్ గౌడ్, రవికుమార్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాకీర్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here