శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాదు డాక్టర్స్ ఫోరం సంయుక్తంగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలోని ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ విభాగపు కాన్ఫరెన్స్ హాలులో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ B. C. రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య B. J. రావు, డాక్టర్ రవి ఆండ్ర్యూస్, అపోలో హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతులు హాజరై మాట్లాడుతూ మన దేశంలో 1991జూలై 1వ తేదీ నుండి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం B. C. రాయ్ జన్మదినాన్ని ఒక ప్రత్యేకమైన నినాదంతో వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. ఈ సంవత్సరం నినాదం ముసుగు ధరించి సంరక్షకులను కాపాడండి అని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజల జీవితాలకు, సమాజాలకు వైద్యులు చేసే అమూల్యమైన సేవలను గుర్తించి కృతజ్ఞతలు చెప్పడమేనని అన్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణపై అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి చుట్టు ప్రక్కల ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ లో పనిచేస్తున్న 35 మంది వైద్యులకు డాక్టర్ B. C. రాయ్ పురస్కారాలు అందజేశారు. షేక్ హమీద్ పటేల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దివేష్ నిగమ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయివ రామస్వామి యాదవ్, హైదరాబాదు డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ కెప్టెన్ రవీంద్రకుమార్, ప్రొఫెసర్ చక్రవర్తి, డాక్టర్ రాజేష్ రెడ్డి (సిటిజన్ హాస్పిటల్), యూనివర్శిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది, వివిధ హాస్పిటల్స్ ప్రతినిధులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, విజయలక్ష్మి, జనార్ధన్, Ch. వెంకటేశ్వరరావు, G. V. రావు, శివరామకృష్ణ, బాలరాజు, ఉమా చంద్రశేఖర్, వాణి సాంబశివరావు, L. వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.