సెల్ ఫోనా..? ఓ వశీకరణ యంత్రమా..!

నమస్తే శేరిలింగంపల్లి: చాలా మందికి పొద్దున్న లేవగానే ఇష్ట దైవాన్ని చూడటమో, లేకపోతే ఇష్టమైన వాళ్ళని చూడటమో, అరచేతులని చూసుకోవటమో లాంటివి చేస్తూ ఉంటారు.. వీడెంటండీ ఆర్టికల్ మొదటిలోనే పాత చింతకాయ పచ్చడి లాగా మాట్లాడ్తున్నాడు అని అనుకుంటున్నారా? అవునండి ఇప్పటికి ఇలా చేసే వారు లేకపోలేదు. కానీ ప్రస్తుత తరుణం లో సెల్ ఫోన్ అనేది పసిపాపల నుంచి పండు ముదుసలి వరకు అందరి చేతుల్లో దర్శనమిస్తోంది. దూసుకుపోయే టెక్నాలజీ జత అవడంతో, వయస్సు తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళ రోజుని సెల్ ఫోన్ తోనే ఆరంభిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పై విధంగా చెప్పిన్నట్టు పాత అలవాట్ల బదులు నిద్ర నుంచి లేవటమే సెల్ ఫోన్ తో మొదలు పెటేస్తున్నారు.

ఫోన్ లో అలారమ్ కట్టేసిన వెంటనే, ఫోన్ లో నే పెట్టుకున్న దేవుడు వాల్ పేపర్ ని చూసేస్తున్నారు. వెంటనే వాట్సాప్ లో మనకి ఏమి మెసేజెస్ వచ్చాయో చూసుకుంటున్నారు. వార్తపత్రికలు కూడా సెల్ ఫోన్ లోనే చదివేస్తున్నారు. ఇలా ఒక్కటేంటి ఇంచుమించు మన రోజువారీ అన్ని పనులు సెల్ ఫోన్ సమక్షంలోనే జరుగుతాయనడం నిస్సందేహం. కాలకృత్యాలు తీసుకునే సమయంలోనూ సెల్ ఫోన్ చేతులో ఉండాల్సిందే. వాస్తవానికి ఇంటర్నెట్ ఉన్న సెల్ ఫోన్ మన దగ్గర ఉంటే ప్రపంచం అంత మన చేతుల్లో ఉన్నట్టే. మనకి ఏ సమాచారమైన ఇట్టే అందుబాటులో ఉంటుంది. కాలక్షేపానికి పాటలు, సినిమాలతో మొదలుకుని ఏ రంగానికి చెందిన సమాచారాన్ని అయినా మనము సెల్ ఫోన్ ద్వారా ఇట్టే పొందచ్చు. ఇటీవల కాలంలో కరోనా లాక్ డౌన్ రావటం తో వీటి వినయోగం మరింత పెరిగింది. సెల్ ఫోన్ తక్కువగా వాడే జనాలు కూడా లాక్ డౌన్ కారణంగా మరింత ఎక్కువగా సెల్ ఫోన్ కి అలవాటు పడ్డారని చెప్పవచ్చు. కొంతమంది జనాలు అయితే అసలు సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోవటం, వాటిని వదలలేకపోవటం లాంటి లక్షణాలు కనబరుస్తున్నారంటే సెల్ ఫోన్ పిచ్చి ఏ పీక్ స్టేజీలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సెల్ ఫోన్ వల్ల మనకి మంచి ప్రయోజనాలు ఉన్నప్పటికి వాటి వల్ల అంతే అనార్ధాలు కూడా లేకపోలేదు. మనకి అవసరం ఉన్నంత వరకు వాడుకుంటే మంచిదే కానీ శృతి మించితే అనేక పర్యావసనాలు తప్పవు. ఇలా విపరీతమైన సెల్ ఫోన్ వాడకం వల్ల చాలా మంది అడిక్ట్ అయ్యిపోరాట. అసలు సెల్ ఫోన్ అడిక్షన్ అంటే ఏంటీ? టూకీగా చెప్పాలంటే అవసరం లేకున్నా లేదా అవసరాన్ని మించి పదే పదే సెల్ ఫోన్ ని వాడటం. మన ప్రభావం లేకుండానే మన మైండ్ మనల్ని సెల్ ఫోన్ వైపు లాగటం. దీనినే సెల్ ఫోన్ అడిక్షన్ అంటారు. ఇలాంటి లక్షణాలను కనబరిచే వారినే సెల్ ఫోన్ అడిక్ట్స్ అని కూడా అంటారు. ఇలా ప్రపంచాన్ని మరచిపోయి సెల్ ఫోన్ లో మునిగిపోయేవారు ఇటీవల కాలంలో బాగా పెరిగారు.

వీరు ఆ అలవాటు నుంచి బయటకి రావటానికి తెగ ఇబ్బంది పడుతున్నారట. ఇలా అపరిమితంగా వాడటం వల్లన యాంగ్జైటీ పెరగటం, నిద్రలేమి, శ్రద్ధ మందగించటం, మెడనొప్పి, మానసికంగా ఆరోగ్యంగా లేకపోవటం వంటి అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటకి రాలేకపోవటం అనేది పెద్ద సమస్యగా జనాలు ఫీల్ అవుతున్నారు. సెల్ ఫోన్ నుంచి డియాడిక్ట్ అవ్వాలంటే ఏమి చెయ్యాలన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. దానిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూద్ధాం…

  • సెల్ ఫోన్ కి లాక్ పెట్టి దానికి పెద్ద పాస్వర్డ్ పెట్టటం, పాస్వర్డ్ పెద్దది పెట్టటం వలన ప్రతి సారి లాక్ ఓపెన్ చెయ్యాలంటే పెద్ద పాస్వర్డ్ టైపు చెయ్యాలి కాబట్టి అవసరం వచ్చినప్పుడే చూసుకోవచ్చులే అన్న భావన వల్ల కొంత వినియోగం తగ్గించొచ్చు.

మనం ఏ ఆప్స్ తరచుగా వాడుతున్నామో వాటిని ట్రాక్ చేసుకుని తగ్గించుకునే ప్రయత్నం చేయటం.
ఆప్స్ తాలూకా నోటిఫికేషన్స్ ని ఆఫ్ చేసుకోవటం. మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్స్ బెల్ మోగిందో మనం చేస్తున్న పనిని పక్కన పెట్టి అదేంటో చూసేస్తాము. నోటిఫికేషన్ ఆఫ్ చేసినప్పటికి ఇంకా ఆప్స్ వైపు ఆకర్షతులు అవుతున్నారంటే, సెల్ ఫోన్ లో ఆ ఆప్స్ అన్ ఇన్ స్టాల్ చేసి అవసరమున్నప్పుడు లాప్ టాప్ లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా తగ్గకపోతే మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని డిలీట్ చెయ్యటం ఉత్తమం.

రోజూ సెల్ ఫోన్ వాడకానికి ఒక్క నిర్థిష్టమైన సమయాన్ని పెట్టుకుని ఆ సమయంలో మాత్రమే వినియోగించాలి. మిగతా సమయం లో కాల్స్ వస్తే అటెండ్ చేసి పక్కన పెట్టటం చేయాలి.ఇప్పుడు వచ్చే సెల్ ఫోన్స్ లో డిజిటల్ వెల్ బీయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది.. దానిని రేఫర్ చెయ్యండి.

సెల్ ఫోన్ లో వాల్ పేపర్ ఫోన్ ని మోటివేషనల్ లేదా సెల్ ఫోన్ ఎక్కువ వినయోగించకూడదు అని సూచించే కోట్స్ ని పెట్టుకోవాలి‌.‌ కనీసం అది చూసినప్పుడల్లా మనము అలర్ట్ అయి ఫోన్ జోలికి వెళ్ళము.

పొద్దున్నే అలారమ్ కట్టేయటంతో మొదలయ్యే మన ఫోన్ వాడకానికి బ్రేక్ పడాలంటే సెల్ ఫోన్ కి బదులు చిన్న వాల్ క్లాక్ తెచ్చుకుని అలారం పెట్టుకోవాలి. సాధారణంగా మనం సెల్ ఫోన్ లో అలారమ్ ఆఫ్ చేసి టైం కి ఏదో ఒక నోటిఫికేషన్ రావటం వల్ల మనం వాటిని తరచుగా చూస్తుంటాం అలాగే కాలం ఫోన్ లో సాగిపోతూ ఉంటుంది. దీనిని అదిగమించాలంటే ఇలా చేయచ్చు.

సెల్ ఫోన్ లో గ్రేస్కేల్ మోడ్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోవటం. ఈ గ్రేస్కేల్ మోడ్ ఆన్ లో ఉంటే ఫోన్ స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్ గా మారిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కన్నా కలర్ స్క్రీన్ మనల్ని ఎక్కువ ఆకర్షతులని చేస్తుంది.

భోజనం చేసేటప్పుడు కానీ, బాత్రూమ్ కి కానీ సెల్ ఫోన్ తీసుకెళ్లటం మానేయాలి. రాత్రి పడుకునేటప్పుడు సెల్ ఫోన్ కి బదులు ఏదైనా బుక్ చదవటం ప్రాక్టీస్ చేస్తే నిద్ర తొందరగా వస్తుంది. సెల్ ఫోన్ వాడకం తగ్గుతుంది.

ఏదేమైనా సెల్ ఫోన్ మితంగా వాడుకోవటమే అందరికి హితం.

వఝా పవన్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here