శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం, ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చెరువుల సుందరీ కరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనుల పై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులలో జరుగుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. పనులలో అలసత్వం లేకుండా నిర్ణీత సమయంలో చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, మిగతా చెరువుల అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు SE శ్రీనివాస్ ,EE నారాయణ, DE నళిని, AE లక్ష్మీ నారాయణ, AE శ్రీనివాస్, AE శశాంక్ తదితరులు పాల్గొన్నారు.






