నమస్తే శేరిలింగంపల్లి: మద్యం సేవించి వాహనం నడిపి ఓ అమాయకుడి మృతికి కారణమైన ద్విచక్రవాహన దారుడు జైలు పాలయ్యాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో బోరబండ మోతినగర్‌కు చెందిన వ్యాపారీ బొజ్జ వీర రాఘవ చౌదరి మధ్యం సేవించి, అతివేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నెంబర్ టీఎస్ 07 ఈఎం 6495 బైక్ పై వెళుతున్నాడు. పర్వత్‌నగర్ చౌరస్తా వరకు చేరుకోగానే సిగ్నల్ పడింది. నిర్లంక్షంతో సిగ్నల్ జంప్ చేసిన వీర రాఘవ చౌదరి ఎదురుగా ఉన్న హోండా యాక్టివా నెంబర్ టీఎస్ 13 ఈఈ 9868 ను డీకొట్టాడు. బైక్ కింద పడిపోగా సదరు వాహనంపై వెనకాల కూర్చొని ఉన్నపెద్దపల్లి జిల్లా గోధావరి ఖనికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కనవేన రాకేష్ వర్మ(29)కు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్‌ను స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మాదాపూర్ పోలిసులు గురువారం వీర రాఘవ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 304-II, మోటార్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 184, 185(a)ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్, రిమాండ్ చేశారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకీ తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడపరాదని, అమయాకుల జీవితాలను బలిగొని వారి కుటుంబ సభ్యులను అనాధలుగా మార్చవద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

