శేరిలింగంపల్లి, మార్చి 10 (నమస్తే శేరిలింగంపల్లి): సంగారెడ్డి జిల్లా ఐబి గెస్ట్ హౌస్ లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు, ఎంసిపిఐయు వ్యవస్థాపక నేత మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేశారు. చట్టసభలో ఓంకార్ పాత్ర అంశంపై ఈనెల 17న రవీంద్ర భారతిలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సభ ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి తుకారాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానంలోని నిజం నవాబు దుర్మార్గపు పాలన తిరుగుబాటుకు, సాయుధ పోరాటానికి దారితీసిందని అన్నారు. తుపాకీ చేతపట్టి 1946 నుంచి 1951 వరకు నిజాం రజాకార్లపై తిరగబడి పోరాడినందుకు నాటి నిజాం ప్రభుత్వం ఓంకార్ తలకు వెలకట్టిందని తెలిపారు. ఆదివాసీలు, గిరిజనులను సమీకరించి వారి హక్కుల కోసం ఓంకార్ పోరాడారని, కౌలు రైతులతో కలిసి పోరాడి చట్టాన్ని సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మానయ్య, టి. కుమార్, నారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, హనుమంతు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.






