శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): ఈనెల 17వ తేదీన రవీంద్ర భారతిలో నిర్వహించనున్న మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను జయప్రదం చేయాలని యంసిపి ఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం మియాపూర్ స్టాలిన్ నగర్ లోని ఎంసిపిఐ(యూ) పార్టీ కార్యాలయంలో ఆయన సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఓంకార్ తన ఆరున్నర శతాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఏ శక్తులకు లొంగకుండా రాజకీయాలకు విలువలు అద్దిన రాజకీయ దురంధరుడు అని కొనియాడారు. నిత్యం ప్రజల కోసం జీవించిన ఆయనను హత్య చేయడం దారుణమని అన్నారు. ఓంకార్ ఆదర్శవంతమైన జీవితాన్ని పోరాటస్మతులను గుర్తు చేసుకుంటూ 2025 మే 12 నుండి 2026 మే 12 వరకు సంవత్సర కాలం పాటు కార్యక్రమాలను వివిధ రూపాలలో ఎంసిపిఐ(యు) పార్టీ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు తాండ్ర కళావతి, ఇస్లావత్ దశరథ్ నాయక్, కమిటీ సభ్యురాలు పి భాగ్యమ్మ, స్థానిక పార్టీ సభ్యులు ఎం.రాణి, విజయలక్ష్మి, కిషన్, గంగాధర్ లక్ష్మి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






