శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని ఈదుల కుంట చెరువు పరిరక్షణ పోరాటంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెరువు పరిరక్షణ కోసం సీపీఎం పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పూర్తి ఆధారాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌జీటీ.. ఈదుల కుంటకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు జిల్లా ఆర్డీవో, పర్యావరణ ఇంజనీర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అలాగే సంబంధిత రికార్డులను పరిశీలించిన అధికారులు.. ఈదుల కుంట చెరువేనని నిర్ధారిస్తూ నివేదికను ఎన్‌జీటీకి సమర్పించారు.
ఎన్‌జీటీ ఆదేశాల మేరకు అధికారులు ఈదుల కుంటను చెరువుగా నిర్ధారిస్తూ నివేదిక సమర్పించడంపై సీపీఎం నాయకులు సి. శోభన్, వి. మాణిక్యం, కె. కృష్ణ, ఎన్. శ్రీనివాసు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చెరువు పరిరక్షణ విషయంలో న్యాయం నెగ్గిందని వారు పేర్కొన్నారు. ఈదుల కుంటను పరిరక్షించడంతోపాటు వర్షాలు, వరదల ద్వారా చెరువును నీటితో నింపి భూగర్భ జలాలను కాపాడాలని సీపీఎం నాయకులు కోరారు.





