శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు జాబితా నోటీసుల అందజేతపై కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్లో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ అధికారులతో, బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ నోటీసు అందినంత మాత్రాన ఓటును తొలగించారని భావించాల్సిన అవసరం లేదన్నారు. గత ఎస్ఐఆర్ ఓటరు జాబితాతో ప్రస్తుత వివరాలు లింక్ కాకపోవడం, పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో స్పష్టత లేకపోవడం, గతంలో వేరే ప్రాంతంలో ఓటరుగా నమోదై ఉండటం లేదా కుటుంబ సభ్యుల పాత ఓటరు వివరాలతో సంబంధం నిర్ధారించలేకపోవడం వంటి కారణాలతో నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందన్నారు.

నోటీసు వెనుక భాగంలో ప్రత్యేకంగా కోరిన పత్రాలనే ప్రధానంగా సమర్పించాలని సూచించారు. గుర్తింపు, పుట్టిన తేదీ, పౌరసత్వం, స్థానికత, పాత ఓటరు వివరాలను నిర్ధారించేందుకు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, 10వ తరగతి లేదా తత్సమాన సర్టిఫికెట్లు, విద్యా రికార్డులు, కుటుంబ సభ్యుల పాత ఓటరు కార్డులు, పాత ఎలక్టోరల్ రోల్ వివరాలు, తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మల పాత ఓటరు జాబితా వివరాలు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి బీఎల్ఓ, బీఎల్ఏ నోటీసుల అందజేతతో పాటు, ఓటర్ల నుంచి అవసరమైన పత్రాలు, వివరాలు సక్రమంగా స్వీకరించేలా సమన్వయంతో పనిచేయాలని హమీద్ పటేల్ సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు బాధ్యతగా స్పందించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
సమావేశంలో ఇన్చార్జి ఏఈఆర్ఓ మహిపాల్ రెడ్డి, ఏఏంసీ సంజయ్ కుమార్, బిల్ కలెక్టర్ ఎం. విద్యాసాగర్‌తో పాటు బీఎల్ఓలు శివ, సుభాష్, అమిత్, లక్ష్మి ప్రవీణ, ముని జ్యోతి, నాగ శ్రీలత, ఖైర్ ఉన్నిసా, కళ్యాణి, రేష్మ బేగం, అలీమా బేగం, బీఎల్ఏలు లక్ష్మి, షబ్బీర్, మహ్మద్ అబ్దుల్ ముక్తార్, మహ్మద్ మహబూబ్, అబ్దుల్ వసీం, సయ్యద్ ఫహీం, సలామ్ బీన్ షకీల్, అఫ్రోజ్ బీన్ తహర్, మహ్మద్ అజ్మాత్, అస్లాం, అబ్దుల్లా, ఖాదర్, ఉస్మాన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.





