ఈదుల కుంట ఆన‌వాళ్ల‌ను వెలికితీస్తున్న‌ హైడ్రా

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్‌లో ఉన్న ఈదులకుంట‌ ఆన‌వాళ్ల‌ను హైడ్రా వెలికి తీస్తోంది. స‌ర్వేఆఫ్ ఇండియా స‌హ‌కారంతో గురువారం స‌ర్వే చేయించి హ‌ద్దుల నిర్ధారించే ప‌నికి శ్రీ‌కారం చుట్టింది. ఖానామెట్ – కూక‌ట్‌ప‌ల్లి గ్రామాల స‌రిహ‌ద్దులో ఉన్న ఈ చెరువు మాయ‌మైంద‌ని స్థానిక సిపిఎం నాయకులు ఫిర్యాదు చేయ‌డంతో హైడ్రా రంగంలోకి దిగింది. నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్ కు చెందిన హై రిజ‌ల్యూష‌న్ మ్యాప్‌ల ఆధారంగా చెరువు ఆన‌వాళ్ల‌ను హైడ్రా ఇదివ‌ర‌కే గుర్తించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ నెల క్రితం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి.. చెరువు ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌కు చెందిన వారు.. ఆ స్థ‌లం త‌మ‌దంటున్న వారితో పాటు.. ఫిర్యాదు చేసిన సిపిఎం నాయకులను హైడ్రా కార్యాల‌యానికి పిలిపించి హైడ్రా ఉన్న‌తాధికారులు విచారించారు. సైబ‌ర్‌సిటీ(హైటెక్ సిటీ) వ‌ద్ద వంతెన నిర్మాణంతో గ‌తంలో తుమ్ముడికుంట – ఈదుల‌కుంట మ‌ధ్య ఉన్న వ‌ర‌ద కాలువ మూసుకుపోయింద‌ని.. ఆ చెరువులోకి నీరు రాక‌పోవ‌డంతో మ‌ట్టితో నింపి క‌బ్జాకు పాల్ప‌డ్డారంటూ విచార‌ణ‌లో ఫిర్యాదుదారులు ఆధారాల‌తో తెలిపారు. ఖానామెట్ – కూక‌ట్ ప‌ల్లి గ్రామాల స‌రిహ‌ద్దుల్లో ఉండ‌డంతో సుల‌భంగా చెరువును ఆక్ర‌మించారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.

స‌ర్వే చేస్తున్న అధికారులు

ఈ నేప‌థ్యంలో స‌ర్వే ఆఫ్ ఇండియాను హైడ్రా రంగంలోకి దించింది. స‌ర్వే ఆఫ్ ఇందియా టోపో మ్యాప్ ప్ర‌కారం పూర్తి స్థాయిలో గురువారం స‌ర్వే చేయించింది. ఖానామెట్ – కూక‌ట్‌ప‌ల్లి విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా అక్క‌డ ఈదుల‌కుంట చెరువు ఉంద‌ని స‌ర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. అలాగే ఎఫ్‌టీఎల్‌, నీటి విస్త‌ర‌ణ ప్రాంతాల‌ను కూడా గుర్తించింది. స‌ర్వేలో హైడ్రా, ఇరిగేష‌న్, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ అధికారులు, పిర్యాదు దారులు సిపిఎం నాయకులు కూడా ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here