శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులతోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళలందరికీ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఎంగిలిపూల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన మెగా బతుకమ్మ సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ జయంతిని పురస్కరించుకుని, రాగం సుజాత నాగేందర్ యాదవ్ ఫౌండేషన్, శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురనేని వెంకటరత్నం, మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆరెకపూడి గాంధీ జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల అపురూపమైన పండుగ అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలనే దేవతగా పూజించే విశిష్ట సంప్రదాయం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని అన్నారు. తెలంగాణ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు, మహిళల ఔన్నత్యానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ, ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. PJR స్టేడియంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని, వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






