నమస్తే శేరిలింగంపల్లి: పోలీసులకు సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం స్టేఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లతో సైబరాబాద్ సీపీ సమావేశమయ్యారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ తాను పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని, పోలీసుల కష్టాలు, బాధలు తనకు బాగా తెలుసునన్నారు. పోలీస్ సిబ్బందిని నేరుగా యోగక్షేమాలను అడిగి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సిబ్బంది తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చేందుకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మెకానిజం ఫిర్యాదు పరిష్కార యంత్రంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.