శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డొయెన్స్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులతో కలిసి బుధవారం పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యూజీడీ వాటర్ తమ కాలనీలో నుంచి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యూజీడీ అవుట్ లెట్ ను మళ్లించేలా చూడాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు.
అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటి ఉధృతికి కాలనీ చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు పడిపోయాయని జీహెచ్ఎంసీ తరపున ప్రహరీ గోడలను నిర్మించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పందిస్తూ యూజీడీ సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రహరీ గోడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలనీలోని నక్షత్ర వనాన్ని, పార్కును పరిశీలించారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు అసోసియేషన్ వారు తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల కార్పొరేటర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట డొయెన్స్ కాలనీ అధ్యక్షుడు కె. వెంకట్ రావు, సెక్రటరీ పి. లింగారెడ్డి, ప్రహ్లాదు, రాంచంద్రయ్య, గోపీనగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రవీందర్ ఉన్నారు.