అనధికార నిర్మాణాలపై సీఎంసీ కొరడా.. 13 నిర్మాణాలు కూల్చివేత

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అనధికార నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను ముమ్మరం చేసింది. భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకునే లక్ష్యంతో మూడు జోన్ల పరిధిలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 14 అనధికార నిర్మాణాలను గుర్తించగా.. 13 నిర్మాణాలను కూల్చివేశారు. మరో 8 నోటీసులు జారీ చేశారు. జోన్‌ల వారీగా కూల్చివేతల వివ‌రాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లి జోన్‌లో 5 నిర్మాణాల‌ను కూల్చివేయ‌గా, కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో 2, కుత్బుల్లాపూర్ జోన్‌లో 6 మొత్తం క‌లిపి 13 అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేశారు.

సైబరాబాద్ పరిధిలో అనధికార నిర్మాణాలను గుర్తించడం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టే వరకు క్షేత్రస్థాయి బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. గుర్తించిన కేసుల్లో అమలులో ఉన్న నిబంధనలు, నిర్దేశిత విధానాల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు. అనధికార నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, గుర్తించిన ప్రతి ఉల్లంఘనపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎంసీ కమిషనర్ సృజ‌న అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించే నిర్మాణాలను అరికట్టడంతో పాటు, నిబంధనల అమలును పటిష్టంగా కొనసాగించేందుకు మూడు జోన్ల పరిధిలో తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు నిరంతరం కొనసాగుతాయని సీఎంసీ స్పష్టం చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here