రాష్ట్రంలో 2450 కి.మీ జాతీయ రహదారులను కేంద్రం నిర్మించింది: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ – రూ. 7853 కోట్లతో మరో 12 రహదారులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో 2,450 కిమీల మేర జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని, ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా మిగిలే ఉందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉద్బోదించారు. శంషాబాద్ పరిధిలోని జీఎంఆర్ ఎరీనా హోటల్ ఆవరణలో రూ. 7853 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 354 కిలో మీటర్ల పొడవుగల 12 జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్ర హైవేలు, రోడ్టు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ తో కలసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పూర్తయిన 96 కి.మీల పొడవైన జాతీయ రహదారులను జాతికి అంకితం చేశామన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు ఈ రహదారులను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.

జాతీయ రహదారుల శంకుస్థాపన లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

తెలంగాణ నుండి ఐదు ఎక్స్ ప్రెస్ హైవేలు వెళ్తున్నాయని, రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కోసం మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అద్భుతంగా రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో హైవేల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏడున్నరేళ్లలో వందశాతానికి పైగా రోడ్ల నిర్మాణం జరిగిందన్న ఆయన రహదారుల కోసం రూ.1.04 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని తెలిపారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో 2,511 కి.మీ మాత్రమే హైవేలు ఉండేవని, మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో ఏడున్నరేళ్లలో 4,996 కి.మీ హైవేల నిర్మాణం జరిగిందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ బిజెపి కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, బీజేవైఎం నాయకులు, మహిళా మోర్చా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శంకుస్థాపనలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, చింతకింది గోవర్థన్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here