శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం సమితి నాయకుడు టి. నితీష్ ధర్మతేజ విమర్శించారు. ఈ విధానాలకు నిరసనగా జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకపోవడం, విద్యార్థులపై ఫీజుల భారం పెంచడం, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వంటి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ప్రధాన డిమాండ్లను ఆయన తెలియజేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలని అన్నారు. జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేసి విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నితీష్ ధర్మతేజ పిలుపునిచ్చారు.





