నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ లోని అహ్మద్ నగర్ లో కనీస సౌకర్యాలు కల్పించడంలో గెలిచిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లు విఫలమయ్యారని, మైనారిటీలు ఉన్న ఇక్కడ రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కలిపించకపోవడం బాధాకరమని బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్థానికుల పిలుపు మేరకు అహ్మద్ నగర్ ను సందర్శించి, వారితో మాట్లాడి సమస్యల తీవ్రతను ఆయన చూసి, తప్పకుండా అండగా ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాయిలాలు వేసి ఓట్లు దండుకొని గెలిచి, మొండిచేయి చూపడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని, భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాంధీ రాత్రి పర్యటనల పేరుమీద జిమ్మిక్కులు చేస్తున్నారని అభివృద్ధిని గాలికొదిలేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అహ్మద్ నగర్ లోని కనీస సౌకర్యాలు డ్రైవేజి, నీరు, రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని లేనిచో పోరాటాన్ని తీవ్రతరం చేసి, కళ్లు తెరిపిస్తామని ఆయన హెచ్చరించారు. పేదవాడి సమస్యలను పరిష్కరించేవరకు బిజెపి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యారమేష్, పాష, రంజాన్, మోయిన్ మరియు అహ్మద్ నగర్ వాసులు పాల్గొన్నారు