నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్లు తేజావత్ వెంకన్న, సుధాంష్ నందగిరిలు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, 12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. రేషన్ షాపుల పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగి 18 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలందరికి బతుకమ్మ చీరలను అందజేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు, ఆదార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ కేంద్రాల్లో చీరల పంపిణీ ఉంటుందన్నారు. బతుకమ్మ చీరల కోసం వచ్చే లబ్దిదారులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించి చీరలను తీసుకోవాలని వారు తెలిపారు.