నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ జిల్లాల, వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 14వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇదివరకు ఎమ్మెల్సీ పోలింగ్ లో పాల్గొన్న ఓటర్లతో పాటు మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రుల సంఖ్య అధికంగానే ఉంది. ఇతర ఎన్నికలతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు తేడా ఉండటం కారణంగా చాలామంది ఓటు వేసే సమయంలో చేసే పొరపాట్ల కారణంగా చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా ఉండటం సర్వసాధారణమవుతోంది. ఓటు వేసేముందు క్రింది విషయాలను ప్రతీ ఓటరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమాలను అనుసరించి ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల మన ఓటు చెల్లుబాటు కానీ ఓట్ల జాబితాలో చేరకుండా చూడవచ్చు.
? ప్రతి ఓటరు ఏదైనా గుర్తింపుతో పాటు ఓటరు స్లిప్పును పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి.
? పోలింగ్ అధికారి ఓటరుకు బ్యాలెట్ పేపర్,
పెన్ను అందజేస్తారు. వారు అందించే పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి.
?బ్యాలెట్ పేపర్ పై ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల పేరు, రాజకీయ పార్టీ, గుర్తులు నిర్దేశించిన గడులలో ఉంటాయి.
?పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు. అభ్యర్థుల పేరు ప్రక్కన గల ఖాళీ గడిలో పెన్నుతో 1,2, 3, 4 ఇలా ప్రాధాన్యతా క్రమంలో నంబర్లు వేయాలి. ప్రాధాన్యత మాత్రం తప్పొద్దు.
?రోమన్ అంకెలు గానీ, టిక్ మార్కు గానీ, అక్షరాలలో గానీ రాయకూడదు.
?క్రమ సంఖ్యలో నెంబర్లు రాసినప్పుడే ఓటు చెల్లుబాటు అవుతుంది.
?బ్యాలెట్ పేపర్ మీద సంతకం చేస్తే ఆ ఓటు చెల్లదు.