శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలోని PJR స్టేడియం నుండి హుడా కాలనీ సబ్ స్టేషన్ రోడ్డు వీధి చివరి వరకు ఇటీవల సిసి రోడ్డు నిర్మాణం పూర్తయి కొన్ని రోజులు గడిచినా, ఇప్పటివరకు రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను తొలగించకపోవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే దుమ్ము, ధూళి ఎగసి పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత GHMC మియాపూర్ సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకుడు పవన్ స్పందిస్తూ వెంటనే రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను పూర్తిగా తొలగించి రోడ్డును శుభ్రం చేయించాలని, దుమ్ము, ధూళి ఎగరకుండా నీళ్లు చల్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి నిరసనలు చేపట్టాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ప్రజల సౌకర్యం, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని అన్నారు.





