నమస్తే శేరిలింగంపల్లి: ప్రస్తుత యుగంలో ఫోన్ నెంబరు లేని వ్యక్తులు ఉండటం చాలా అరుదు. దాదాపుగా ప్రతీ ఒక్కరి పేరిట ఏదో ఒక నెట్‌వర్క్ లో సెల్ నెంబరు రిజిస్టర్ అయి ఉంటుంది. కొంతమంది ఒకటికి మించి నెంబర్లు వినియోగిస్తుంటారు. మరికొందరైతే తమ కుటుంబ సభ్యులకోసం తమ గుర్తింపు కార్డులతో సెల్ నెంబరు తీసి ఇస్తుంటారు. ఇదిలా ఉంటే కొద్దిమంది వ్యక్తులు తరచూ తమ ఫోన్ నెంబర్లను మార్చుతూ ఉంటడమే కాకుండా తమ గుర్తింపు కార్డులపై లెక్కకు మించి నెంబర్లు తీసుకుంటుంటారు. ప్రస్తుతం గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తి ప్రత్యక్షంగా సిమ్‌కార్డులు లభించే కార్యాలయాల్లో తమ వేలి ముద్రతో సిమ్ కార్డు పొందాల్సి ఉంటుంది. అయితే ఈ సదుపాయం రాకముందు కొందరు వ్యక్తుల గుర్తింపు కార్డులపై వారి ప్రమేయం లేకుండానే సెల్‌ఫోన్ నెంబర్లు జారీ అయ్యేవి. అయితే ఎవరైనా వ్యక్తులు వారికి తెలియకుండానే వారి పేరుతో కొనసాగుతున్న నెంబర్ల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
విజయవాడ టెలికాం విభాగం అధికారులు వ్యక్తుల పేర్లపై నమోదైన నెంబర్ల వివరాలు తెలిపేందుకు http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా సేవలందిస్తున్నారు. ఈ వెబ్ సైట్లో మొబైల్ నంబరు ఎంటర్ చేసి దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే సదరు వ్యక్తుల పేరిట ఉన్న నెంబర్ల వివరాలు కనిపిస్తాయి. వాటిలో మనకు ఉపయోగం లేనివి, మనకు తెలియకుండా ఇతరులు వాడుతున్న వాటిని సెలక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఆ నెంబర్ల సర్వీసులను నిలిపివేసేందుకు టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది. ఒక వ్యక్తి పేరుతో అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు వాడకంలో ఉన్న కారణంగా వాటికి చెక్ పెట్టేందుకు ఈ పోర్టల్ ను ప్రారంభించినట్లు టెలికాం అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని త్వరలోనే దేశ వ్యాప్తంగా సేవలందిస్తామని అధికారులు ప్రకటించారు.