నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ రెండవ దశ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు ప్రారంభించారు. మొత్తం 30 సర్కిళ్లలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఐదు పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఒకే అపార్ట్మెంట్ లో ఎక్కువ కేసులు వస్తే హౌజ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు.
శేరిలింగంపల్లి చందానగర్ జంట సర్కిళ్లలో మొత్తం ఐదు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శేరిలింగంపల్లి సర్కిల్ కొండాపూర్ డివిజన్(104) పరిధిలోని సిద్దిక్ నగర్, శేరిలింగంపల్లి డివిజన్ (106) పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, చందానగర్ సర్కిల్ మాదాపూర్ డివిజన్(107) పరిధిలోని ఆదిత్య నగర్, హఫీజ్ పేట్ డివిజన్(109) పరిధిలోని హఫీజ్ పెట్ గ్రామం, చందానగర్ డివిజన్(110) పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలను మినీ కంటైన్మెంట్ జోన్లుగా నిర్ణయించారు. జోన్లలో తరచు శానిటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కంటోన్మెంట్ జోన్ లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అత్యంత అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.