- వరద నిలిచే ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు
నమస్తే శేరిలింగంపల్లి: రహదారులపై వరద నీరు నిల్వకుండా ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధునాతన వాటర్ హోల్డింగ్ స్టక్చర్లను నిర్మిస్తున్నట్లు మున్సిపల్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ పేర్కొన్నారు. వీటి నిర్మాణాలతో రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఏర్పడుతున్న అంతరాయానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని రోడ్ నంబర్ 45, నెక్టార్ గార్గెన్స్, సైబర్ టవర్స్ ప్రాంతాలలో ఎస్ఎన్‌డీపీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వాటర్ హోల్డింగ్ స్టక్చర్ల( ఇంకుడు గుంతల)ను జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డితో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా దుర్గం చెరువులో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్‌ను తనిఖీ చేసారు. అనంతరం దాన కిశోర్ మాట్లాడుతూ కీలకమైన ప్రధాన రహదారులపై వరద నీరు ఇంకుడు గుంతల్లోకి తక్షణమే చేరుతుందని, తద్వారా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగదన్నారు. ప్రత్యేక మోటార్లతో వీటిల్లోని వరద నీటిని సమీపంలోని నాలాలు, డైన్లలోకి నింపే ఏర్పాటు చేస్తున్నట్లు దాన కిశోర్ పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా తొలుత శేరిలింగంపల్లి జోన్‌లో చేపడుతున్న ఈ తరహా నిర్మాణాలను దశల వారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. జాప్యం లేకుండా నిర్మాణాలను పూర్తి చేయాలని, నీటి మళ్లింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి, ఎన్‌ఎన్‌డీపీ సీఈ కిషన్, ఎస్ఈ శంకర్, డీఈఈ రమేష్ ఉన్నారు.