మాకు దిక్కెవరు… గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ నిరుపేదలు…

  • కొండాపూర్ జేవీసీ హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన గుడిసెల తొలగింపు
  • భారీ పోలీసు బందోబస్తు మధ్య శేరిలింగంపల్లి బల్దియా అధికారుల కొరడా
  • దిక్కుతోచని స్థితిలో 50 కుటుంబాలు
  • బిజెపి నాయకుల నిరసన – బిజెపి నాయకుడు రవి కుమార్ యాదవ్ అరెస్ట్
గుడిసెలను తొలగించిన శేరిలింగంపల్లి బల్దియా అధికారులు

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ జేవీసీ హిల్స్ పార్క్ స్థలంలో వెలసిన గుడిసెలను అర్ధాంతరంగా తొలగించడంతో .. అందులో నివసిస్తున్న పేదలు రోడ్డున పడ్డారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ గుడిసెల్లోని సామాగ్రిని బయట వేసి వారిని బజారు పాలు చేశారు శేరిలింగంపల్లి బల్దియా అధికారులు. ఈ గుడిసెల తొలగింపును బీజేపీ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవికుమార్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, అనిల్ కుమార్ యాదవ్, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్ తదితరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఉన్న పలంగా బాధితులను రోడ్డున పడేస్తే ఎలా అని ప్రశ్నించారు. గుడిసెలు కూల్చకుండా వారికి కొంత సమయం ఇచ్చి లేదా వేరే ప్రాంతంలోకి తరలించాలని, బాధితులకు పక్కా ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

గుడిసెవాసులకు ధైర్యం చెబుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్

ఎక్కడికి పోవాలి…

గుడిసెల తొలగింపు చేపట్టిన పోలీసులు, బల్దియా అధికారులు

ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ మండలం నాదులా పూర్ గ్రామంలో ఓ కాంట్రాక్టర్ వద్ద వెట్టిచాకిరి చేస్తున్న తమను 2014లో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బాండెడ్ లేబర్ గా గుర్తించి అక్కడి నుండి విడిపించి శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ లో గుడిసెలు వేయించి ఉంచారని బాధితులు తెలిపారు. అయితే ఆ స్థల యజమాని 2018లో అక్కడి నుండి ఖాళీ చేయించడంతో ఇక్కడికి వచ్చి ఉంటున్నామని, తమకు ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను కూడా ఇక్కడే ఇచ్చారని, ఇప్పుడు ఇక్కడి నుండి కూడా ఖాళీ చేయిస్తే తాము ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని కోరారు. అయితే రోడ్డుపై ఆక్రమణలకు పాల్పడడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమకు ఫిర్యాదులు అందటంతో గుడిసెలను తొలగించినట్లు శేరిలింగంపల్లి బల్దియా అధికారులు చెబుతున్నారు.

గుడిసెలోని సామాగ్రిని బయట వేయడంతో రోడ్డుపై కూర్చున్న బస్తి వాసి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here