- ఉత్సవాలను ప్రారంభించిన శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ప్రభుత్వవిప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్ప ఎన్‌క్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీదేవాలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమయ్యింది. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందానగర్ ప్రాంతంలో ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. స్థానిక భక్తులు పదిరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు.
ఉత్సవాల్లో మొదటి రోజు భక్తులు లక్ష్మీనారాయణ, నాగమణి దంపుతులచే శ్రీ సిద్ధి, బుద్ధి సమేత గణపతి కళ్యాణం, అనంతరం దీపోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందంల పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ ఉత్సవాలలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, చందానగర్ వెంకటేశ్వరాలయ ప్రధానార్చకులు సుదర్శనం సత్యసాయి ఆచార్యులు, వాస్తు సిద్ధాంతి ప్రసాద శర్మ, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి తరించారు. పది వేల దేపాల వెలుతురులో శిల్పా ఎన్‌క్లేవ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణం కళకళలాడింది.