- మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఏ నాగేశ్వరరావు
- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో అత్యున్నత శాసనం భారత రాజ్యాంగమని, మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఏ నాగేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌలిదొడ్డిలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాల వద్ద ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ నాగేశ్వరరావు విచ్చేసి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రజిత అధ్యక్షత వహించారు. విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ “భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఆగస్టు 29న భారత రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మరో ఆరుగురు సభ్యులతో కూడిన డ్రాఫ్టు కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించినట్లు తెలిపారు.

అందరికి సమానముగా రక్షణ కల్పించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, లింగ వివక్ష లేకుండా ఉండటం, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, అల్ప సంఖ్యాకుల రక్షణ, ఆ హక్కులను పొందటానికి అవసరమైతే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళే ప్రత్యేక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కేవి రమణ, భారతి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, జనార్ధన్, అమ్మయ్య చౌదరి, బాలన్న పాల్గొన్నారు.