ఏమిస్తావ్ ఏమిస్తావ్ భావి తరాలకేమిస్తావ్
బ్రతుకునిచ్చి, బ్రతుకనిచ్చి కడుపాకలి తీర్చి
కాచుకున్న భూతల్లిని కాలుష్య కోరలలో ముంచి,
పాలు తాగి, రొమ్ము గుద్ది పసిబిడ్డలకేమిస్తావ్…?
వనమాతను తెగనమ్మి, వృక్షాలను నేలకూల్చి
భూదందా చేసుకొనగ భూమినంత చదును చేసి
నింగిన నీటి ధార లేక, నేలయంత నెర్రలిడగ
ఆకసానికర్రు చాచిన రైతన్నలకేమిస్తావ్…?
చెరువులన్ని చెరబట్టి, మట్టి పూడ్చి మాయ చేసి
అద్దాల మేడ కట్టి, అమాయకులకు అంటగట్టి
నీరు ఇంకు జాగ లేక, వరదలన్ని పోటెత్తగ,
నిలువనీడ లేక చేసి, నమ్మినోళ్ళకేమిస్తావ్..?
బోర్లు వేసి భూ గర్భమును పీల్చి పీల్చి పిప్పి చేసి
నీళ్లు తోడి అమ్ముకుని కాసులెన్నో నింపుకుని
ఒళ్ళు కడగ నీళ్లు లేక జనమంతా అల్లాడగా
నీటిపోరు సలుపుతున్న సాద జనులకేమిస్తావ్..?
అద్భుత అణు ఇంధనమని అడవిని అసువులు బాపి
అంతులేని రోగాలను అమాయకపు జనులకిచ్చి
నింగి నేల నీటినంతా అణు ధార్మికత తో నింపి
తిండి గాలి నీరు లేని అన్నార్థులకేమిస్తావ్..?
పదిగ్రాముల పాత సంచి, పరుసునందు పెట్టలేక
పలుచనైన ప్లాస్టిక్కుతో పుడమినంత పొరలు పేర్చి
పశువుల ప్రాణాలు తీసి, పచ్చదనం పెకలించి
పర్యావరణాన్ని చంపి పొరుగువారికేమిస్తావ్..?
కర్మాగారాలు పెట్టి కలుషితాలు పుట్టించి
జీవమును నిలుపుతున్న జీవనదులలో కలిపి,
విషపూరిత వాయువులను విపరీతము వెదజల్లి
ప్రాణవాయువు దొరకని ప్రాణి కోటికేమిస్తావ్..?
జీవమునిచ్చిన ప్రకృతిని జీవచ్ఛవముగ చేసి
మనువలు, మునిమనువలంటు సంపదలను పోగు చేసి
పచ్చ నోట్ల కట్టలతో పట్టెడన్నం పెట్టలేవు
గనుల కొద్ది మణులున్నా గుక్కెడు నీళ్లివ్వలేవు
ప్రముఖమైన ఆస్తులున్న ప్రాణవాయుఊదలేవు.
నిలువెత్తు కనకమిచ్చిన నిలువనీడ కొనలేవు.
నేటికైన నిజమెరిగి నేర్పుతో మెలగవోయి
పచ్చటి ధరణి ని పదికాలాలు కాపాడవోయి.
-రమేష్ పల్లె
8019161908